: కేజ్రీవాల్ ను వెనకేసుకొస్తున్న జేడీయూ అధినేత
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం నోటీసు అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు జేడీయూ అధినేత శరద్ యాదవ్ మద్దతుగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయాలని కేజ్రీవాల్ పేర్కొనడం తెలిసిందే. దాంతో, కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేసింది. కాగా, శరద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. "ఓ వ్యక్తి బీజేపీ, కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకోమంటున్నాడు, కానీ, ఓటును అమ్ముకోవద్దంటున్నాడు" అని అన్నారు. కేజ్రీవాల్ అలా వ్యాఖ్యానించడం సరైనదేనని ఈ సీనియర్ పొలిటీషియన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజల ఆర్థిక నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ధనబలం, కండబలం కీలక పాత్ర పోషిస్తాయని యాదవ్ పేర్కొన్నారు.