: తెలంగాణ ప్రజలపై కేసీఆర్ భారం మోపుతున్నారు: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వ్యవహార పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ విమర్శనాస్త్రాలు సంధించారు. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే, ఆ ప్రయోజనాలను ప్రజలకు కల్పించలేదని మండిపడ్డారు. ధరలు తగ్గించాల్సింది పోయి, 2 రూపాయల వ్యాట్ పెంచి ప్రజలపై అదనపు భారం మోపారని ఆరోపించారు. బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, ఫిబ్రవరి 15 వరకు సలహాలను స్వీకరిస్తామని... అనంతరం ఫిబ్రవరి 20న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ కు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. పీసీసీ మార్పుపై ఎవరు మాట్లాడినా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.