: తన కోసం దొంగగా మారిన ప్రేయసిని పట్టిచ్చిన ప్రియుడు
ప్రేమికుడి కోసం ప్రియురాలు దొంగగా మారింది. చిట్టచివరికి ఆమెను పట్టించింది ప్రియుడే కావడం విశేషం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడలోని పాయకాపురం శాంతినగర్‌కు చెందిన నూకల దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపివేసింది. ఆమెకు మూడేళ్ల క్రితం ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి దాసరి కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ప్రేమ పిచ్చిలో కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని సిటీబస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది. అలా సంపాదించిన దానితో ఇద్దరూ జల్సా చేసేవారు. ఈ రకంగా ఆమె రెండేళ్లలో విజయవాడలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 చోరీలకు పాల్పడింది. వీటిలో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో సిటీ బస్సుల్లో చోరీలపై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘాపెట్టారు. గవర్నరుపేటలోని ఓ థియేటర్ వద్ద కృష్ణంరాజు అనుమానాస్పద స్థితిలో తిరుగుతూ ఈ బృందానికి పట్టుబడ్డాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. దీంతో చోరీ వివరాలతో పాటు, ప్రియురాలి గుట్టుకూడా విప్పాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, సొత్తు స్వాధీనం చేసుకున్నారు.