: మఫ్టీలో పోలీసులను పంపి, మద్యం తెప్పించి... డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన ఎస్పీ సుమతి!
మద్యం విక్రయాలు జరుపుతూ, సిట్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్న దాబా హోటళ్లపై మెదక్ జిల్లా ఎస్పీ సుమతి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నిన్న రాత్రి తూప్రాన్ మీదుగా వెళ్తున్న ఆమె రాత్రి సమయంలో ఒక దాబాలో మద్యం సిట్టింగ్‌లను గమనించి వాహనాన్ని ఆపి, మఫ్టీలో ఉన్న పోలీసులను పంపి మద్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల మాదిరిగా దాబాలోకి వెళ్ళిన సుమతి గన్ మెన్ లు మద్యం అడిగిన వెంటనే దాబా నిర్వాహకుడు ఇచ్చాడు. వెంటనే స్థానిక డీఎస్పీ, ఎస్ఐలతో కలసి రంగంలోకి దిగిన సుమతి దాబా నిర్వాహకుణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాబా హోటళ్లలో మద్యం విక్రయించినా, సిట్టింగ్‌లను నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.