: నాలుగు ఉగ్రవాద సంస్థలు కాచుకుని కూర్చున్నాయి... జాగ్రత్త సుమా!: ఐబీ
భారత్ లో దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్ నుంచి నాలుగు ఉగ్రవాద సంస్థల అనుచరులు భారత్ చేరారని, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాల పోలీసు అధికారులను హెచ్చరించింది. జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైషే జయీద్ (అహ్మద్) సంస్థలకు చెందిన ఉగ్రవాదులు భారత్ లో అక్రమంగా చొరబడ్డారని, వారికి తోడు స్లీపర్ సెల్స్ కూడా దాడుల్లో పాలుపంచుకోనున్నాయని ఐబీ స్పష్టం చేసింది. ఐబీ హెచ్చరికలతో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లోని విమానాశ్రయాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దేశంలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులు భద్రతను పెంచారు. తనిఖీలను ముమ్మరం చేశారు. రిపబ్లిక్ డే దగ్గర పడుతుండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని సాధారణ పౌరులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఒబామా పర్యటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.