: జగన్ కు యనమల ఫోన్... తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవంపై చర్చలు
తిరుపతి ఉప ఎన్నికపై ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు ఓ అవగాహనకు రానున్నాయి. తిరుపతి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరే అవకాశాలు మెరుగవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేద్దామన్న యనమల ప్రతిపాదనకు జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెబుతామని జగన్, యనమలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతి నుంచి దివంగత నేత వెంకటరమణ సతీమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమవుతోంది. ఇదిలా ఉంటే, తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామంటూ లోక్ సత్తా, కాంగ్రెస్ పార్టీలు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికార, విపక్షాల చర్చలతో ఆ పార్టీల అభిప్రాయాలు మారే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్య కారణాలతో మరణించిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.