: రూ.5 కే బోజనం... హైదరాబాదులో మరో యాభై కేంద్రాలకు జీహెచ్ఎంసీ కసరత్తు


హైదరాబాదులో ఐదు రూపాయలకే భోజనాన్ని అందించే కేంద్రాలను విస్తరించాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించేలా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. మరో 50 కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరేకృష్ణ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్న 20 కేంద్రాలను ప్రారంభించామని ఆయన అన్నారు. వాటికి వస్తున్న ఆదరణ చూసిన తరువాత మరిన్ని కేంద్రాలను ప్రారంభించాలని, హైదరాబాదులో ఆకలి అన్న మాటకు తావులేని విధంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నడుస్తున్న 20 భోజన కేంద్రాల్లో ఒక్కో భోజనానికి హరేకృష్ణ ట్రస్టుకు జీహెచ్ఎంసీ 15 రూపాయలు చెల్లిస్తోంది. 5 రూపాయలను భోజనం చేసే వ్యక్తి నుంచి ట్రస్టు వసూలు చేస్తోంది. పెద్ద ఏజెన్సీలు, దాతలు ముందుకు వస్తే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సాధారణంగా అన్నదానం చేసే దాతలు, తమకు మద్దతిస్తే వారి కోరిక మేరకు ఎన్ని భోజనాలైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సోమేష్ కుమార్ తెలిపారు. అలాగే దాతలకు పన్ను రాయితీలు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న 20 కేంద్రాల్లో ప్రతి రోజూ సుమారు 6,500 మంది భోజనాలు చేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News