: కులాంతర వివాహం చేసుకున్నాడని టెక్కీకి గ్రామ బహిష్కరణ
కుల వ్యవస్థ గ్రామాల్లో ఎంత బలంగా వేళ్లూనుకుందో తెలిపే మరో ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగా ఆ గ్రామపెద్దలు ఓ ఉన్నత విద్యావంతుడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. మూడేళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు టెక్కీ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రత్నగిరి జిల్లా వాఘీవర్ గ్రామానికి చెందిన సంజయ్ కదమ్ (29) మూడేళ్ల క్రితం ముంబైకి చెందిన శ్వేత గడ్కరీ అనే యువతిని కుటుంబ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమకంటే తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంగా అతని కుటుంబాన్ని కుల పెద్దలు బహిష్కరించారు. ముంబైలో నివాసం ఉంటున్న సంజయ్ కదమ్ కు పండుగలు, వేడుకలను గ్రామంలోనే నిర్వహించుకోవడం అలవాటు. అలా వచ్చే సంజయ్ కుటుంబానికి కనీసం ఉప్పు, పప్పు కూడా ఇవ్వొద్దని పెద్దలు ఆంక్షలు విధించారు. బంధువులను కూడా కట్టడి చేయడం ప్రారంభించారు. తాజాగా లక్ష రూపాయల పరిహారం కడితే బహిష్కరణ ఎత్తేస్తామని బేరసారాలు ప్రారంభించారు. దీంతో సంజయ్ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. కమిషన్ ఆదేశాలతో గ్రామపెద్దలపై చిప్లున్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై స్పందించిన గ్రామపెద్దలు కదమ్ ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు.