: ముస్లింలను కాపాడిన హిందూ వితంతువుకు నగదు బహుమతి
పదిమంది ముస్లింలను కాపాడి మానవత్వం చాటుకున్న వితంతువుకు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నగదు బహుమతి ప్రకటించారు. ఆమె ప్రదర్శించిన మానవత్వానికి అందరూ అభినందించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె ధైర్యసాహసాలు, స్పూర్తిని కొనియాడిన ఆయన 51 వేల రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెలితే... బీహార్ లోని అజీజ్ పూర్ గ్రామంలో ముస్లిం మతస్తులు ఓ హిందూ యువకుడ్ని బంధించి హతమార్చారు. దీనికి ప్రతిగా సదరు యువకుడి వర్గానికి చెందిన సుమారు 5 వేల మంది హిందువులు అజీజ్ పూర్ పై దాడికి దిగారు. ఈ దాడిలో 25 ఇళ్లు, పలు వాహనాలు కాలి బూడిదయ్యాయి. హిందువుల దాడిలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే గ్రామానికి చెందిన షెయిల్ దేవి అనే 50 ఏళ్ల వితంతువు, తన ఇంట్లో పది మంది ముస్లింలను దాచి, ఇంటి బయట ఇద్దరు ఆడపిల్లలతో కాపలాగా నిలబడింది. తమ ఇంట్లో ఇతరులెవ్వరూ లేరని దాడి చేసిన వారికి సమాధానమిచ్చి వారిని కాపాడింది. ప్రాణాలతో బయటపడిన వారు ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. ఆమె ధైర్యంపై పలు కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఆమెను అంతా అభినందిస్తుండగా, ఆ రాష్ట్ర సీఎం నగదు బహుమతి ప్రకటించారు.