: సన్ టీవీతో నాకెలాంటి సంబంధాలు లేవు: దయానిధి మారన్
అక్రమ టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో తన అనుచరులను సీబీఐ అరెస్టు చేయడంపై కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆయన డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సీబీఐ వెనుక ఆర్ఎస్ఎస్ నేతల హస్తం ఉంది. అందుకే సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసి, వారిని హింసిస్తూ, నాపై వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని ఒత్తిడి చేసింది" అని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐకి సహకరించి కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. సన్ టీవీతో తనకెలాంటి సంబంధాలు లేవన్నారు. కేంద్ర, రాష్ట్ర (తమిళనాడు) ప్రభుత్వాలు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయన్నారు.