: బస్సుల్లో వేలాడే విద్యార్థులపై కఠిన చర్యలు
కళాశాలలో చేరిన తరువాత బస్సులోని ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం ఓ హీరోయిజం. ఎవరైనా లోపలికి వెళ్లమన్నా లేక దారివ్వమన్నా జరిగే తంతు అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ఈ వివాదాలు ఘర్షణకు దారితీసి, అమాయకులు గాయపడుతున్న సందర్భాలు కోకొల్లలు. ఇవి మితిమీరిపోతుండడంతో తమిళనాడు ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు నడుం బిగించింది. ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణించే విద్యార్థులను టీసీలు పట్టుకుంటే వారిది తొలి తప్పుగా భావించి వారి తల్లిదండ్రులతో చెప్పి మందలిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే వారి పాస్ ను స్వాధీనం చేసుకుంటారు. మూడోసారి కూడా అదే తప్పు చేస్తూ పట్టుబడితే వారికి కళాశాల నుంచి టీసీ ఇచ్చి పంపించడంతోపాటు, మరే కళాశాలలో చేరని విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రేమ పేరిట బస్సుల్లో జరిగే హీరోయిజం ప్రదర్శన, వివాదాలు అడ్డుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రమాదాలు, ఘర్షణలు నివారించవచ్చని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు.