: మాస్కుల్లేవ్... వసతులూ లేవు: స్వైన్ ఫ్లూ చికిత్స చేయలేమంటున్న తెలంగాణ వైద్యులు
తెలంగాణలో నానాటికీ విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ మరో ముగ్గురు వైద్యులకు సోకింది. హైదరాబాదులోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పోటెత్తుతున్న రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. నిన్నటిదాకా ఐదుగురు వైద్యులకు వ్యాధి సోకగా, తాజాగా నేడు మరో ముగ్గురు ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా జూనియర్ డాక్టర్లే కావడం గమనార్హం. దీంతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై జూడాలు అసంతృప్తి వెళ్లగక్కారు. ఉస్మానియాతో పాటు గాంధీ ఆస్పత్రిలోనూ సరైన సౌకర్యాలు లేవని, రోగులకు చికత్స అందిస్తున్న తమకు కనీసం మాస్కులు కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తాము స్వైన్ ఫ్లూ బారిన పడుతున్నామని చెబుతున్న జూడాల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, సౌకర్యాలు మెరుగుపరచకుంటే విధులకు హాజరుకాలేమని కొద్దిసేపటి క్రితం తేల్చిచెప్పారు. అంతేకాక ఆస్పత్రి ముందు ఆందోళనకు కూడా దిగారు.