: వెంకన్న తెప్పోత్సవంలో అపశ్రుతి... నీట మునిగిన పడవ... ఇద్దరి దుర్మరణం
కోనేటిరాయుని తెప్పోత్సవం విషాదాన్ని మిగిల్చింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం ప్రసన్న వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం జరుగుతుండగా బరువు పెరిగి పడవ కోనేరులో మునిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తాత, మనవడు మృతిచెందగా, వెంకటేశ్వర స్వామి, ఉభయ దేవేరుల విగ్రహాలు నీట మునిగాయి. కోరేరులో స్వామి మూడు పర్యాయాలు విహరించాల్సి వుంది. రెండు విహారాల తరువాత, మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ అక్కడికి చేరుకోగా, స్థానిక నాయకులు ఆయన్ని తెప్పలో ఎక్కాల్సిందిగా కోరారు. ఆయనతో పాటు ఆయన అనుచర వర్గం సైతం అత్యుత్సాహంతో పరిమితికి మించి తెప్పలోకి ఎక్కడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన అధికారులు గజ ఈతగాళ్ళను పిలిపించి మృతదేహాలను వెలికి తీయించారు. విగ్రహాలను బయటకు తీసి సంప్రోక్షణ అనంతరం తిరిగి దేవాలయంలో ప్రతిష్టించారు.