: ఆరెస్సెస్ జాతీయవాది... దేశాన్ని సమైక్యంగా ఉంచుతోంది!: కిరణ్ బేడీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ వారం తిరక్కుండానే అచ్చమైన బీజేపీ నేతగా మారారు. కృష్ణా నగర్ నుంచి నిన్న నామినేషన్ దాఖలు చేసిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైద్ధాంతిక సంస్థగా భావిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై ఆమె తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆరెస్సెస్ ను జాతీయవాదిగా అభిర్ణించిన ఆమె, ఆ సంస్థ దేశాన్ని సమైక్యంగా ఉంచుతోందని వ్యాఖ్యానించారు. ‘‘ ఆరెస్సెస్ నేతలు జాతీయవాదులు. దేశాన్ని సమైక్యంగా ఉంచుతున్న ఆ సంస్థ, దేశాన్ని పరిశుభ్రంగానూ ఉంచుతోంది’’ అని ఆమె అన్నారు. ‘‘మీకెవరికీ వారి గురించి తెలియదు. నేను ప్రత్యక్షంగా చూశాను. క్రమశిక్షణతో ఉండే ఆ సంస్థ నేతలు, యువతకు క్రమశిక్షణను నేర్పుతున్నారు’’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.