: చిన్నంపల్లిలో చిరుతలు... భయాందోళనల్లో గ్రామస్థులు
నిన్న తిరుపతి, నేడు చిన్నంపల్లి... అరణ్యంలో ఉండాల్సిన చిరుతలు జనావాసాల్లోకి వచ్చేశాయి. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల సమీపంలో వారం పాటు సంచరించిన చిరుత అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. తాజాగా అనంతపురం జిల్లా చిన్నంపల్లి సమీపంలోకి నిన్న సాయంత్రం ఏకంగా రెండు చిరుతలు వచ్చేశాయి. గ్రామ శివారులోకి వచ్చిన చిరుతలు, జనసంచారాన్ని పసిగట్టి పరుగులు తీశాయి. ఓ చిరుత తిరిగి అడవుల్లోకి పరుగులు తీయగా, మరో చిరుత మాత్రం గ్రామ సమీపంలోని పొదల్లో దాక్కుంది. గ్రామస్థుల నుంచి సమాచారమందుకున్న అటవీ శాఖాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పొదల్లో నక్కిన చిరుతను బంధించేందుకు యత్నించారు. అయితే వారి యత్నాలు ఫలించలేదు. విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులతో మాట్లాడారు. గ్రామస్థులకు చిరుతల నుంచి రక్షణ కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక చిరుతలు జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన అటవీ శాఖ సిబ్బందికి సూచించారు.