: ఇక జర్నలిస్టుల వంతు... సునంద కేసులో విలేకరులను ప్రశ్నించనున్న పోలీసులు!
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు తాజాగా జర్నలిస్టుల మెడకూ చుట్టుకుంటోంది. గతేడాది జనవరి 16, 17 తేదీల్లో సునంద, థరూర్ లతో మాట్లాడిన జర్నలిస్టుందరినీ ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సునంద పుష్కర్ హత్యకు దారి తీసిన కారణాలను వెలికితీసేందుకు పోలీసులు ఏ ఒక్క మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే శశి థరూర్ ను ఓ విడత ప్రశ్నించిన పోలీసులు మరోమారు ఆయనను శోధించే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ దఫా విచారణలో భాగంగా ఐపీఎల్ కోణంలో థరూర్ కు ప్రశ్నలు ఎదురుకానున్నాయి. ఇక గతేడాది జనవరి 16, 17 తేదీల్లో థరూర్, సునందలు ఎవరెవరితో మాట్లాడారన్న విషయంపై దృష్టి సారించిన పోలీసులు... ముగ్గురేసి రాజకీయవేత్తలు, జర్నలిస్టులతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని తేల్చారు. ఈ జాబితాలోని జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్ ను పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు విచారణకు హాజరుకమ్మని పోలీసులు తనను ఆదేశించారని అతడే స్వయంగా ట్విట్టర్ ద్వారా నిన్న వెల్లడించాడు. మిగిలిన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు కూడా త్వరలో సమన్లు అందజేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.