: ఒబామా కోసం రంగంలోకి 'అవాక్స్' విమానాలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వస్తుండడంతో కేంద్రం అత్యున్నత స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తోంది. భారత రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజున అవాక్స్ విమానాలను రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)లను కలిగి ఉన్న ఇల్యూషిన్-76 విమానాలు ఆకాశం నుంచి గస్తీ కాస్తుంటాయి. రాజ్ పథ్ పరిసర ప్రాంతాలపై ఇవి నిఘా వేస్తాయి. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవాక్స్ విమానాలను మోహరించనుండడం ఇదే ప్రథమం. టెర్రరిస్టులు ఆకాశ మార్గాల్లో దాడులకు పాల్పడవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నారు. 400 కిలోమీటర్ల పరిధిలో యుద్ధ విమానాలు, క్షిపణులకు సంబంధించిన కదలికలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వీటి సొంతం. ఈ టెక్నాలజీని ఇజ్రాయిల్ అందించింది. రాడార్లకు దొరకకుండా ఉండేందుకు యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. అలాంటి యుద్ధ విమానాలను సైతం 'అవాక్స్' విమానాలు పసిగట్టేస్తాయి.