: ఐపీఎల్ కేసులో సుప్రీం తీర్పు రేపే
ఐపీఎల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ పై సుప్రీంకోర్టు రేపు తుది తీర్పు వెలువరించనుంది. సుమారు ఏడాదిన్నర తరువాత అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో తుది తీర్పును వెల్లడించనుంది. 2013 జూన్ లో జరిగిన ఐపీఎల్ లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాలు వెలుగుచూశాయి. కొందరు క్రికెటర్లు అవినీతికి పాల్పడ్డారని, వారితో బేరాలు కుదుర్చుకున్నది కొన్ని జట్ల యజమానులేనని వార్తలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా పలు కీలకాంశాలు వెలుగు చూశాయి. శ్రీశాంత్, అంకిత్ చవాన్ తదితర ఆటగాళ్లను అరెస్టు చేశారు కూడా. ఈ నేపథ్యంలో, అప్పట్లో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి ఎన్.శ్రీనివాసన్ ను తప్పుకోవాలంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ఐసీసీ చైర్మన్ పీఠం అధిష్ఠించారు. అయినాగానీ, భారత క్రికెట్ పై చక్రం తిప్పేందుకు వీలుగా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయసాగారు. రేపు సుప్రీం తుది తీర్పు వెలువరించనుండడంతో, ఆయన మరోసారి ఆ పదవికి పోటీ పడే అవకాశం ఉన్నదీ లేనిదీ తేలిపోనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధినేతగా శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.