: పది మంది ముస్లింలను కాపాడిన హిందూ వితంతువు
పదిమంది ముస్లింలను కాపాడి మానవత్వం చాటుకుందో వితంతువు. బీహార్ లోని అజీజ్ పూర్ గ్రామంలో ముస్లిం మతస్తులు మెజారిటీ వర్గంగా ఉన్నారు. తమ మతానికి చెందిన యువకుడ్ని బంధించి చంపారని ఆరోపిస్తూ పక్క గ్రామంలోని హిందువులు సుమారు 5 వేల మంది అజీజ్ పూర్ పై దాడికి దిగారు. మత విద్వేషాలు రాజుకోవడంతో నలుగుర్ని సజీవదహనం చేశారు. కనిపించిన వారిని కనిపించినట్టు చావబాదుతుండడంతో అదే గ్రామానికి చెందిన షెయిల్ దేవి అనే 50 ఏళ్ల వితంతువు, తన ఇంట్లో పది మంది ముస్లింలను దాచి, ఇంటి బయట తన ఇద్దరు కుమార్తెలతో కాపలా ఉంచింది. ఇంట్లో ఎవరున్నారంటూ అడిగినవారికి ఎవరూ లేరని సమాధానం చెప్పి పంపేసింది. దీంతో, ఆందోళనకారులు వెళ్లిపోవడంతో ఆ పది మంది ముస్లింలు ఊపిరిపీల్చుకున్నారు.