: ఒకే రోజు ఐదుగురు చనిపోయారన్న వార్త ఇబ్బందిగా అనిపించింది: కేసీఆర్


స్వైన్ ఫ్లూపై తెలంగాణ సర్కారు సమరశంఖం పూరించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఒకే రోజు ఐదుగురు మరణించారన్న వార్త ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, స్వైన్ ఫ్లూ నియంత్రణకు కేంద్ర సహకారం కోరామని తెలిపారు. ఈ ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పారు. ప్రధాని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించారని తెలిపారు. రాష్ట్రానికి 50 వేల డోసులు, 10 వేల సిరప్ లు పంపుతామని కేంద్రం హామీ ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం నుంచి నిపుణుల బృందాలను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిపారు. హైదరాబాదులో తాజాగా మరో 25 ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. స్వైన్ ఫ్లూ భయంకరమైన సమస్యకాదని ప్రైవేటు ఆసుపత్రులు చెప్పాయని, అయినా, ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించడమే ఉత్తమమని కేసీఆర్ సూచించారు. స్వైన్ ఫ్లూ మందులు కేవలం ప్రభుత్వాసుపత్రుల్లోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల 99 శాతం వ్యాధి సోకదని అన్నారు. తీవ్రమైన జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలని చెప్పారు. జిల్లాల్లో అయితే తాలూకా, ప్రాంతీయ ఆసుపత్రులను సంప్రదించాలని, హైదరాబాదులో అయితే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. స్వైన్ ఫ్లూ రోగులు సినిమా హాళ్లలోకి, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. స్వైన్ ఫ్లూను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించామని, జిల్లాల్లోని నోడల్ అధికారులు సీఎస్ కు నివేదికలు ఇస్తారని తెలిపారు. ఇది రోగం కాదని వైరస్ అని అన్నారు. అరికట్టడమే దానికి మందు అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News