: విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు 'నో' చెప్పిన సిరివెన్నెల!
కేంద్ర ప్రభుత్వం విశాఖపట్టణాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే. ఏపీ సర్కారు కూడా తన వంతుగా ఈ పోర్ట్ సిటీకి మరింత సొబగులద్దేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ప్రతి ఏడాది విశాఖ ఫెస్టివల్ పేరిట వేడుకలు నిర్వహించాలని నిశ్చయించింది. ఈ క్రమంలో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఉత్సవానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఓ థీమ్ సాంగ్ ఉంటే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ప్రముఖ గీత రచయితతో దీనికి సంబంధించి పాట కూడా రాయిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదివరకే ప్రకటించారు. అందుకోసం ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహకులు కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించారట. దీంతో, నిర్వాహకులు స్థానిక గీత రచయితతో పనికానిచ్చేందుకు మొగ్గుచూపారు. కాగా, సిరివెన్నెల నిరాకరణకు కారణాలు తెలియరాలేదు.