: వారిద్దరూ అవకాశవాదులే: కేజ్రీ, బేడీలపై కాంగ్రెస్ ధ్వజం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఆప్ అధినేత, ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీలపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కేజ్రీవాల్ తో పాటు కిరణ్ బేడీ కూడా అవకాశవాదేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఢిల్లీ ప్రచార సారథి అజయ్ మాకెన్ అన్నారు. ఇధ్దరు నేతలు కూడా అవకాశవాదులకే ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. సామాజిక ఉద్యమకర్త అన్నా హజారేను వారిద్దరూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కూడా అజయ్ మాకెన్ విమర్శించారు. అవినీతిపై పోరుతో వెలుగులోకి వచ్చిన వారిద్దరూ ప్రస్తుతం ఆ అంశంపై నోరు మెదపడం లేదన్నారు. ఇక కిరణ్ బేడీకి అసలు రాజకీయ అనుభమే లేదని మాకెన్ వ్యాఖ్యానించారు.