: తెలంగాణ బోనాలు... ఆంధ్రా సంక్రాంతి... ఢిల్లీ వీధుల్లో తెలుగు శకటాలు!
వచ్చేవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత తొలిసారి ఢిల్లీ వీధుల్లో శకటాల ప్రదర్శనపై ప్రభుత్వాలు గట్టి పట్టుదలతో వున్నాయి. బోనాల పండుగ ఇతివృత్తంతో తెలంగాణ, సంక్రాంతి పండుగ ఇతివృత్తంతో ఏపీ శకటాలు రూపొందుతున్నాయి. బోనాల ఉత్సవం ప్రారంభమయ్యే గోల్కొండ కోట నమూనా ముందు బోనాలు తలపై ధరించిన మహిళలు, మెడలో నిమ్మకాయలు, పూలు, పూసల దండలు ధరించి కొరడాతో కొట్టుకునే పోతురాజు, వేపచెట్టుకింద ఎల్లమ్మ దేవత, వేపమండలు పట్టుకున్న మహిళలు, జోస్యం చెప్పే మహిళలు, తట్టలు తదితరాలతో తెలంగాణ శకటాన్ని అలంకరిస్తున్నారు. ఇక ఆంధ్రా విషయానికి వస్తే, పల్లె వాతావరణం, సంక్రాంతి ముగ్గులు, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు తదితరాలతో శకటాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించడంలో అధికారులు తలమునకలై వున్నారు.