: ‘ఎర్ర’ స్మగ్లర్లుగా చైనీయులు... బెంగళూరులో నలుగురు అరెస్ట్
శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం పలు అక్రమ మార్గాల ద్వారా సింగపూర్, చైనా తదితర దేశాలకు తరలుతోంది. ఎర్రచందనం దుంగలతో బొమ్మలు, అలంకార సామగ్రిని తయారుచేస్తూ చైనీయులు భారీగా సంపాదిస్తున్నారు. అంతేకాక విలువైన సుగంధ ద్రవ్యాల తయారీలోనూ చైనీయులు ఎర్రచందనాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. నిన్నటిదాకా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎర్రచందనాన్ని అక్రమ మార్గాల్లో చైనాకు చేరవేస్తుండగా, తాజాగా చైనీయులే స్మగ్లింగ్ లోకి దిగిపోయారు. లాభసాటిగా ఉన్నందునే చైనా దేశీయులు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు రంగంలోకి దిగారని పోలీసులు చెబుతున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తూ నలుగురు చైనీయులు నిన్న బెంగళూరు పోలీసులకు దొరికిపోయారు. అరెస్టైన నలుగురు చైనీయుల్లో ముగ్గురు యువకులున్నారు. అదుపులోకి తీసుకున్న చైనీయుల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సెంట్రల్ జోన్ ఏసీపీ అరుణ్ చక్రవర్తి చెప్పారు.