: 'స్మార్ట్' రాకెట్ తో దుమ్మురేపుతున్న 'రఫా'
మాజీ వరల్డ్ నెంబర్ వన్, క్లే కోర్టు రారాజు రఫెల్ నడాల్ గాయాల నుంచి కోలుకుని ఉత్సాహంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో అడుగుపెట్టాడు. తొలి రౌండ్ లో రష్యా ఆటగాడు మిఖాయిల్ యౌజ్నీని వరుస సెట్లలో చిత్తుగా ఓడించాడు. ఆ మ్యాచ్ లో గాయాల తాలూకు ప్రభావం అస్సలు కనిపించలేదు. అంతలా రెచ్చిపోయాడీ స్పెయిన్ బుల్. అయితే, ఈ మ్యాచ్ లో సరికొత్త రాకెట్ తో బరిలో దిగాడు రఫా. చూడ్డానికి సాధారణ టెన్నిస్ రాకెట్లా కనిపించినా, హ్యాండిల్ గ్రిప్ చివర ఓ ఆన్-ఆఫ్ స్విచ్ దర్శనమిస్తుంది. ఆ స్విచ్ ను ఆన్ చేస్తే బంతి రాకెట్ కు ఏ ప్రదేశంలో తాకింది? అది ఏ దిశగా దూసుకెళ్లింది? ఎంత శక్తితో అది దూసుకెళ్లింది? వంటి వివరాలన్నీ నిక్షిప్తమవుతాయి. అందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఈ టెన్నిస్ రాకెట్ లో అమర్చిన సెన్సర్లు సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత రాకెట్ ను కంప్యూటర్ కు గానీ, స్మార్ట్ ఫోన్ కు గానీ అనుసంధానించి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించవచ్చు. తద్వారా ఆటతీరును మెరుగుపర్చుకునే అవకాశముంటుంది. ఈ తరహా రాకెట్లు ఎంతో ఉపయుక్తమని యౌజ్నీతో మ్యాచ్ అనంతరం నడాల్ అన్నాడు.