: కుక్క పిల్లకు కోట్ల ఆస్తి కలిసొచ్చింది!
అమెరికాలో ఓ మహిళ తన ఆస్తిలో పెంపుడు కుక్కకు కూడా వాటా దక్కేలా వీలునామా రాసింది. న్యూయార్క్ కు చెందిన రోజ్ ఆన్ బొల్సానీ అనే ఈ 60 ఏళ్ల మహిళ నగలు, ట్రస్ట్ ఫండ్, ఇల్లు వంటి మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను తన పెంపుడు కుక్క పేర రాయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాల్టీజ్ టెర్రియర్ జాతికి చెందిన ఈ శునకం పేరు 'బెల్లా మియా'. వీలునామాపై బొల్సానీ మాట్లాడుతూ... "మేం ఆ కుక్క పిల్లకు విలాసవంతమైన జీవితాన్ని అందించాలని నిర్ణయించుకున్నాం. నేను పోయినా దానికి ఏ లోటూ రాబోదు" అని పేర్కొన్నారు. దాన్నెంతో గారాబంగా పెంచామని, మనుషుల కంటే మిన్నగా మూడేళ్లలో అది ఎంతో సేవ చేసిందని బొల్సానీ తెలిపారు. కాగా, పెంపుడు కుక్కకు తమ తల్లి ఆస్తి రాయడం పట్ల బొల్సానీ కుమారులు లూయిస్, రాబర్ట్ ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. వారికేమీ లోటు రానీయడం లేదని, బెల్లా మియా కంటే వారికి ఎక్కువగానే ఆస్తి రాశానని బొల్సానీ వెల్లడించారు.