: ఈసారి బ్యాట్స్ మెన్ ను తప్పుబట్టాడు!
ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి బ్యాట్స్ మెన్ వైఫల్యమే కారణమంటున్నాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో పరాజయానికి బౌలర్లను తప్పుబట్టిన ధోనీ ఈ మారు బ్యాటింగ్ లైనప్ ను నిందిస్తున్నాడు. బ్రిస్బేన్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలవడం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. "టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మేం ఆశించిన విధంగా బ్యాటింగ్ చేశామని భావించడంలేదు. ఆరంభ ఓవర్లలో పిచ్ పేస్ కు సహకరించగా, బ్యాట్స్ మెన్ దీటుగా ఎదుర్కోలేకపోయారు. భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉన్నా, ఆ పనిచేయలేకపోయాం. వరల్డ్ కప్ కు ముందర ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగపర్చుకోవాల్సి ఉంది. నాలుగున్నర నెలలుగా స్వదేశానికి దూరంగా ఉండడం కష్టమైన విషయం. అయితే, మేం అన్ని రకాల పరిస్థితులకు అనువుగా సర్దుకోవాల్సి ఉంటుంది" అని ధోనీ పేర్కొన్నాడు.