: చిత్తుగా ఓడిపోవడం అంటే ఇదే!
ముక్కోణపు సిరీస్ లో టీమిండియా మరో పరాభవాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిన ధోనీ సేన నేటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు, బౌలింగ్ లోనూ మనవాళ్లు చేతులెత్తేశారు. బ్రిస్బేన్ పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని తెలిసినా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ధోనీ భారీ తప్పిదానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి వరుస తప్పిదాలతో మ్యాచ్ చేజారింది. బ్యాట్స్ మెన్ తప్పుడు షాట్ సెలక్షన్ తో వికెట్లు పారేసుకోగా, స్వల్ప స్కోరును కాపాడుకోలేక బౌలర్లు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇంగ్లాండ్ పేసర్లు ఫిన్ (5 వికెట్లు), ఆండర్సన్ (4 వికెట్లు) ధాటికి కకావికలమైంది. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. చివరికి 39.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ (44) టాప్ స్కోరర్. ధోనీ 34, రహానే 33 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్ ను అంచనా వేయడంలో పొరబాటు పడిన భారత బ్యాట్స్ మెన్ షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం కనబరిచి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇక, స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గా బరిలో దిగిన ఇయాన్ బెల్ (88 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ కు మరో పరాభవం తప్పలేదు. అతనికి తోడు టేలర్ (56 నాటౌట్) కూడా సమయోచితంగా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో తొలి విజయం నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మొయిన్ అలీ (25) వికెట్ మాత్రమే పతనం కాగా, ఆ వికెట్ స్టూవర్ బిన్నీ ఖాతాలో చేరింది. బెల్ చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 27.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఫిన్ కు దక్కింది.