: ఏపీతో విభేదాల పరిష్కారంలో కేంద్రం జోక్యం అవసరం లేదు: తెలంగాణ మంత్రి కేటీఆర్
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీతో తమకు నెలకొన్న వివాదాల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. నేటి ఉదయం ఓ తెలుగు ప్రైవేట్ టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీతో తలెత్తిన వివాదాలను పరిష్కరించుకునే సామర్థ్యం తమకుందని ఆయన పరోక్షంగా కేంద్రానికి చురకలంటించారు. ఈ విషయంలో తాము కేంద్రం జోక్యాన్ని కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. విద్యుత్ విషయంలో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని చంద్రబాబు తన తెలంగాణ పర్యటనలో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని కూడా కేటీఆర్ హెచ్చరించారు. దేశంలోనే సమగ్ర ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న వాటర్ గ్రిడ్ పథకం ఖర్చులో కేంద్రం సగంమేర భరించాలని ఆయన డిమాండ్ చేశారు.