: ఢిల్లీలో మా సీఎం అభ్యర్థి కిరణ్ బేడీనే!: బీజేపీ ప్రకటన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థుల జాబితాను నిన్న రాత్రి విడుదల చేసింది. ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని బరిలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కిరణ్ బేడీ నాయకత్వంలో పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దీంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరును అధికారికంగా ప్రకటించినట్టయింది. ఢిల్లీలోని కృష్ణా నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కిరణ్ బేడీ పోటీ చేస్తారని అమిత్ షా పేర్కొన్నారు. నిన్న రాత్రి భేటీ అయిన పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో తమ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ తో కలిసి బరిలోకి దిగనున్నామని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పార్టీ ఢిల్లీ శాఖ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ పోటీకి దూరంగా ఉన్నారు. తన నేతృత్వంలో పార్టీ ఎన్నికల బరిలో దిగుతుండటం పట్ల కిరణ్ బేడీ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకముంచిన పార్టీ అధిష్ఠానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.