: ఇంగ్లాండ్ తో ఎలా ఆడతారో?: కీలక మ్యాచ్ కు టీమిండియా సిద్ధం


ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియా మంగళవారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. బ్రిస్బేన్ లో జరిగే ఈ మ్యాచ్ లో గెలుపు బోణీ కొట్టాలని భారత్ భావిస్తోంది. తమ తొలి మ్యాచ్ లలో భారత్, ఇంగ్లాండ్ జట్లు పరాజయం చవిచూశాయి. రెండు జట్లనూ ఆసీస్ చిత్తు చేసింది. దీంతో, రేపటి మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు కీలకం కానుంది. టీమిండియా విషయానికొస్తే... బ్యాటింగులో ఒకరిద్దరు రాణించడం మినహా సమష్టి ప్రదర్శన కనపడడంలేదు. బౌలర్లు కొత్తబంతితో విఫలమవుతుండడంతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కు పెద్దగా సవాళ్లు ఎదురవడంలేదు. ముఖ్యంగా, ఓపెనర్ శిఖర్ ధావన్ వైఫల్యాలు జట్టుకు నష్టం చేకూరుస్తున్నాయి. ఎంతటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుకైనా శుభారంభం లభిస్తేనే సానుకూల ఫలితాలు వస్తాయి. ధావన్ కారణంగా భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రిస్బేన్ పిచ్ పేస్ కు అనుకూలిస్తుందన్న వార్తల నేపథ్యంలో మరోమారు టీమిండియా టాపార్డర్ కు పరీక్ష తప్పదనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో స్టార్క్ ధాటికి భారత బ్యాట్స్ మెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం తెలిసిందే. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రేపటి మ్యాచ్ కు బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో, ఆండర్సన్, బ్రాడ్, జోర్డాన్ లతో కూడిన ఇంగ్లాండ్ పేస్ దాడులను భారత్ ఎలా కాచుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. అటు, ఇంగ్లాండ్ జట్టులో యువరక్తం తొణికిసలాడుతున్నా అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్ ముందర కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో పుంజుకోవాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News