: కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నటి జీవిత... చైర్మన్ గా పహ్లాజ్ నిహలాని
నటి జీవిత కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కేంద్రం సెన్సార్ బోర్డులో 9 మంది నూతన సభ్యులను నియమించింది. బాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత పహ్లాజ్ నిహలాని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. జీవితతో పాటు ఎస్.శేఖర్, జార్జ్ బేకర్, మిహిర్ భూటా, సయ్యద్ బారీ, రమేశ్ పతంగె, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, అశోక్ పండిట్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇటీవలే, సెన్సార్ బోర్డు చైర్మన్ పదవికి లీలా శాంసన్ రాజీనామా చేయడం తెలిసిందే. ఆమెతో పాటు తొమ్మిది మంది బోర్డు సభ్యులు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. డేరా సచ్ఛా సౌధా ఆధ్యాత్మిక వర్గం ప్రధాన గురువు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా వ్యవహారంలో మనస్తాపం చెందిన లీలా పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డుపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినందునే ఆమె పదవిని వీడినట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో ఇతరుల జోక్యం నచ్చలేదని లీలా వ్యాఖ్యానించారు. బోర్డులో అవినీతి పెరిగిపోయిందని కూడా ఆమె ఆరోపించారు.