: గవర్నర్ సూచనలను పాటిస్తే ఉమ్మడి పరీక్షలకు సిద్ధమే: గంటా
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో ఏపీ సర్కారు ఖాతాలను స్తంభింపజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు లేఖ రాయడం దారుణమని, ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తెలంగాణ సర్కారు తీరుపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరినట్టు గంటా తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని అన్నారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక, స్థానికేతర తీరుతో ఏకపక్షంగా వెళుతున్నారని విమర్శించారు. గవర్నర్ సూచనలను తెలంగాణ సర్కారు పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. గవర్నర్ సూచనలను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తే తాము ఉమ్మడి పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని గంటా స్పష్టం చేశారు. వివిధ ప్రవేశ పరీక్షలను తామే నిర్వహించుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ సాయంత్రం ఆయా సెట్ లకు సంబంధించి తేదీలను ప్రకటించడం తెలిసిందే. దీనికి ప్రతిచర్యగానే మంత్రి గంటా గవర్నర్ ను కలిసినట్టు అర్థమవుతోంది.