: వివిధ ప్రాంతాల నుంచి తప్పిపోయిన ఎనభైఏడు మంది పిల్లలను గుర్తించిన పోలీసులు
గడచిన 14 సంవత్సరాలలో వివిధ ప్రాంతాల్లో అదృశ్యమైన పిల్లల్లో 87 మందిని ఉత్తరాఖండ్ పోలీసులు గుర్తించారు. చిన్నారుల ఆచూకీ కోసం జనవరి 1న హరిద్వార్ లో ప్రారంభించిన ‘ఆపరేషన్ స్మైల్' స్పెషల్ డ్రైవ్ విజయవంతమైందని, కేవలం 18 రోజుల వ్యవధిలోనే 87 మంది చిన్నారుల ఆచూకీని తెలుసుకోగలిగామని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. హరిద్వార్ జిల్లాలోని రూర్కీ, మంగ్లౌర్, లుస్కార్ తదితర ప్రాంతాల్లో 43 మంది బాలికలతో పాటు 44 మంది బాలురను గుర్తించామని అధికారులు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి 2014 వరకూ సుమారు 146 మంది తప్పిపోయారని తెలిపారు. పిల్లల సంబంధీకులు వస్తే, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వారికి అప్పగిస్తామని చెప్పారు.