: పాలమూరు జిల్లాపై కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయింది: డీకే అరుణ
వరంగల్ లో నాలుగు రోజుల పాటు బస చేసిన టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనను మాత్రం ఒక్క రోజులోనే ముగించేశారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. అది కూడా ఒక్క ప్రాంతంలోనే పర్యటించారని... ఒక్కోరోజు ఒక్కో డివిజన్ లో పర్యటించి సమస్యలు తెలుసుకొని ఉంటే బాగుండేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలన్నింటినీ కేసీఆర్ మర్చిపోయారని ఆరోపించారు. సీఎస్ కన్నా ఎమ్మెల్యేలే గొప్ప అని చెప్పిన కేసీఆర్... విపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. జిల్లాకు తాగునీటిని ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకు తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా తన పర్యటనను ముగించారని దుయ్యబట్టారు.