: ప్రధాని మోదీ పేరిట వెబ్ సైట్ పెట్టి కోట్లు కాజేసిన ఘనుడు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరిట 'ప్రధానమంత్రి ఆదర్ష్ యోజన' అంటూ ఒక వెబ్ సైట్ మొదలుపెట్టి, దానికి అనుబంధంగా 17 మందితో కాల్ సెంటర్ ను నడిపి కోట్లాది రూపాయలను కాజేశాడో ఘనుడు. పోలీసులు ఈ భారీ స్కాంను ఛేదించి, నిందితుడు సుద్పితా చటర్జీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హౌరాకు చెందిన చటర్జీ యూఎస్ లోని ఒక సర్వర్ కేంద్రంగా ఫేక్ వెబ్ సైట్ మొదలెట్టాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం రుణాలు ఇస్తుందని ఆశ చూపుతూ, ప్రాథమికంగా 'ప్రధానమంత్రి ఆదర్ష్ యోజన' కార్యక్రమానికి కొంత నిధులను సాయం చేయాలని కోరేవాడు. ప్రభుత్వ స్టాంపులు, లెటర్ హెడ్ లు తయారు చేసి తన మాయలో పడిన వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. చటర్జీ మాటలు నమ్మి ప్రపంచవ్యాప్తంగా 200 మంది లక్షల రూపాయల నిధులను అందించారు. మొత్తం కుంభకోణాన్ని వెలికితీసిన పోలీసులు త్వరలో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.