: టీఆర్ఎస్... డీఫాల్టర్ పార్టీ: ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ వెల్లడి


నిజమే, తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని కేంద్ర ఎన్నికల సంఘం డీఫాల్టర్ పార్టీగానే పేర్కొంటోంది. ఈ మేరకు తన అధికారిక వెబ్ సైట్ లో, టీఆర్ఎస్ ను డీఫాల్టర్ పార్టీల జాబితాలో చూపిస్తోంది. అసలు కారణమేంటంటే, గత సార్వత్రిక ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను టీఆర్ఎస్ అందించలేదట. అంతేకాక సదరు వ్యయాలను తక్షణమే పంపాలన్న తమ నోటీసులను కూడా ఆ పార్టీ బేఖాతరు చేసిందని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఖర్చులు చెప్పకపోవడం, ఆ విషయంలో తన నోటీసులకు స్పందించని కారణంగా టీఆర్ఎస్ ను డీఫాల్టర్ పార్టీల జాబితాలో చేరుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా లోక్ సభ ఎన్నికలకైతే 90 రోజులు, అసెంబ్లీ ఎన్నికలకైతే 75 రోజుల్లోగా ఆయా పార్టీలు తాము చేసిన వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సి ఉంది. అయితే ఎన్నికలు ముగిసి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా టీఆర్ఎస్ ఈ పని చేయలేదు. దీంతో ఎన్నికల సంఘం రెండు సార్లు పార్టీని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వ్యయంపై లెక్కలు చెప్పకపోతే, కఠిన చర్యలు తప్పవన్న నవంబర్ 28 నాటి తమ నోటీసులకూ పార్టీ నుంచి స్పందనే లేదని ఈసీ వెబ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను సమర్పించామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News