: హామీ ఇస్తాడు... పారిపోతాడు: కేసీఆర్ పై రేవంత్ ధ్వజం


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై టీ-టీడీపీ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇచ్చి పారిపోవడం కేసీఆర్ కు అలవాటేనన్నారు. ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలేనని మండిపడ్డారు. మహబూబ్ నగర్లో నివాసం ఏర్పరచుకుంటానని, నెలలో సగం రోజులు ఇక్కడే ఉంటానని కేసీఆర్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారని వివరించారు. ఆ మేరకు గెలిపించి పార్లమెంటుకు పంపితే, ఆ తర్వాత ఏనాడూ పాలమూరు రాలేదన్నారు. కరీంనగర్ జిల్లాలో పోటీ చేసినప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే వ్యవహరించారని దుయ్యబట్టారు. ప్రస్తుతం మెదక్ విషయంలోనూ అదే నైజం కనబరుస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్ ను అక్కున చేర్చుకుంటున్న కేసీఆర్ పాలమూరు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతోనే జిల్లాలో సమీక్ష సమావేశాలను రద్దు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News