: మెల్బోర్న్ వన్డేలో భారత్ ఓటమి... రోహిత్ శ్రమ వృథా
ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో మెల్బోర్న్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 267 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో కంగారూలు 6 వికెట్లకు 269 పరుగులు చేసి విజయాన్నందుకున్నారు. ఆసీస్ జట్టులో ఫించ్ (96) టాప్ స్కోరర్. చివర్లో ఆసీస్ వడివడిగా వికెట్లు చేజార్చుకున్నా వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ (13 నాటౌట్), ఫాక్నర్ (9 నాటౌట్) జోడీ జట్టును విజయతీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్, షమి, పటేల్, అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు, భారత్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (138) సెంచరీ హైలైట్. ఆసీస్ బౌలర్ల పదునైన పేస్ దాడులతో పాటు, మాటల దాడులను కూడా సమర్థంగా కాచుకుని రోహిత్ ఈ శతకం సాధించాడు. భారత ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. కాగా, ఈ సిరీస్ లో ఆసీస్ కు ఇది వరుసగా రెండో విజయం. ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కంగారూలు 3 వికెట్ల తేడాతో నెగ్గారు. వరుసగా రెండో విజయం సాధించిన ఆసీస్ ఖాతాలో ప్రస్తుతం 9 పాయింట్లున్నాయి. ఇంగ్లండ్ పై మ్యాచ్ లో ఆతిథ్య జట్టుకు బోనస్ పాయింట్ లభించింది. ఇక, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఈ నెల 20న బ్రిస్బేన్ లో జరగనుంది.