: రూ. 8 వేల లంచం ఇవ్వడానికి కిడ్నీని అమ్మేసింది
మన దేశంలో నెలకొన్న అవినీతి... పేదల జీవితాలను ఏవిధంగా కాటేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా దారుణమైన ఉదాహరణ మరొకటి ఉండదు. ఓ రెవెన్యూ అధికారి డిమాండ్ చేసిన రూ. 8 వేల లంచం ఇవ్వడానికి ఏకంగా తన కిడ్నీనే అమ్మేసిందో పేద మహిళ. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగపట్న తాలూకాలో చోటుచేసుకుంది. 55 ఏళ్ల వయసున్న చిక్కతాయమ్మ అనే మహిళ ఏడాదికి పైగా ఒక కిడ్నీతోనే గడుపుతోంది. తన తండ్రి భూమిని పొందడానికి రెండో కిడ్నీని అమ్మేశానని ఆమె చెెప్పిన మాటలు, విన్నవారికి బాధ కలిగించక మానవు. 15 ఏళ్లుగా తన తండ్రి భూమిని పొందటం కోసం తాలూకా కార్యాలయానికి వెళుతున్నప్పటికీ ఏ మాత్రం ఉపయోగం లేకపోయిందని... ఆ పరిస్థితుల్లో తన కిడ్నీని బలవంతంగా అమ్మేయాల్సిన పరిస్థితి దాపురించిందని చిక్కతాయమ్మ తెలిపింది. ఒక పేద మహిళగా ఇంతకన్నా మరేమీ చేయలేకపోయానని చెప్పింది. మైసూరు దగ్గర్లో తాయమ్మ తండ్రికి చెందిన 15 ఎకరాల భూమి ఉంది. కానీ, అది అన్యాక్రాతం అయింది. ఈ క్రమంలో దొడ్డయ్య అనే అధికారి రూ. 8 వేల లంచం అడిగాడని తెలిపింది. రూ. 8 వేలు తనకు చాలా పెద్ద మొత్తమని... విధిలేని పరిస్థితుల్లో బెంగళూరులో కిడ్నీని అమ్మేశానని చెప్పింది. ఈ విషయం కర్ణాటక లోకాయుక్త దృష్టికి వెళ్లడంతో, విచారణకు ఆదేశించింది. లంచం తీసుకున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ను సస్సెండ్ చేసింది.