: ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీనా?... అదెలా కుదురుతుందన్న ఆరెస్సెస్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి రోజుకో కొత్త సమస్య ఎదురవుతోంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో అష్టకష్టాలకోర్చి మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని పార్టీలోకి తీసుకొస్తే, కిరణ్ బేడీకి అంత ప్రాధాన్యమెందుకంటూ ఆ పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మండిపడుతోంది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కిరణ్ బేడీని పార్టీ సీఎం అభ్యర్థిగా ఎలా ప్రచారం చేస్తారంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న సీనియర్లను కాదని కిరణ్ బేడీకి అంత ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామం కాదంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారట. మోహన్ భాగవత్ అసంతృప్తిపై సమాచారం అందుకున్న పార్టీ నేతలు ఉమా భారతిని రాయబారం పంపారట. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హుటాహుటిన నాగ్ పూర్ వెళ్లిన ఉమా భారతి ఇచ్చిన వివరణ మోహన్ భాగవత్ ఆగ్రహాన్ని చల్లార్చిందో, లేదో తెలియరాలేదు.