: షాంగై మాకెందుకు?... ముంబైని ‘ముంబై ఫస్ట్’ గా మారుస్తాం: మహా సీఎం ఫడ్నవీస్
తెలుగు రాష్ట్రాల సీఎంలు సింగపూర్, మలేసియాల నామజపం చేస్తుంటే, మరాఠా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం స్థానిక మంత్రాన్నే పఠిస్తున్నారు. ‘‘షాంగై, సింగపూర్ లు మాకెందుకు... ముంబై నగరాన్ని ముంబైగానే ఉంచుతూ ‘ముంబై ఫస్ట్’గా మార్చడమే మా లక్ష్యం’’ అంటూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు బహుళ జాతి సంస్థలను ఆహ్వానించడంలో తలమునకలై కొత్తకొత్త ఆలోచనలు చేస్తుండగా, ఫడ్నవీస్ మాత్రం స్థానిక వనరుల ఆధారంగానే పరిశ్రమలను రాబడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దావోస్ లో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు హాజరవుతున్న ఆయన అక్కడ కూడా ముంబై నగరాన్ని ముంబైగానే చూపనున్నారు. దేశంలో పెట్టుబడులకు ముంబైని స్వర్గధామంగా మలుస్తామని చెబుతున్న ఆయన నగరాన్ని ముంబై ఫస్ట్ గా మలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు.