: చిట్టీల పేరిట కోటిన్నర లేపేసి పరార్!
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరానికి చెందిన ఓ చీటీపాటల నిర్వాహకుడు సుమారు రూ.1.42 కోట్ల మోసానికి పాల్పడ్డట్టు తెలిసింది. గ్రామంలో సైకిల్ షాపు నిర్వహించే షేక్ జానీబాషా ఎన్నో ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నాడు. అతనివద్ద 27 రకాల చిట్టీల్లో 200 మందికి పైగా సభ్యులు వున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25 నుంచి జానీబాషా కనిపించడం లేదు. గ్రామంలోనే వున్న ఆయన భార్య స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ, అతని ఆచూకీ లభించకపోవడంతో చిట్టీలు వేసిన వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీటీపాటల లావాదేవీలు కోట్ల రూపాయలకు పెరిగిన నేపథ్యంలో అతను కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.