: సల్మాన్ ను అమెరికా పోలీసులు పట్టుకోలేకపోయారు... హైదరాబాదీ పోలీసులు పట్టేశారు!
ఐఎస్ఐఎస్ కు అనుకూలంగా కార్యకలాపాలు సాగించిన హైదరాబాదీ ఇంజినీర్ సల్మాన్ మొయినుద్దీన్ ను అమెరికా పోలీసులు ఎంతమాత్రం గుర్తించలేకపోయారు. అయితే మూడు నెలల వ్యవధిలోనే హైదరాబాదీ పోలీసులు అతడిని పట్టేసి తమ సత్తా చాటారు. అమెరికాలో విద్యనభ్యసించిన సల్మాన్, ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాల వైపు దృష్టి సారించాడు. అమెరికాలో ఉండగానే ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్లతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించాడు. నాలుగేళ్ల పాటు అక్కడే ఉన్న అతడి ‘ఉగ్ర’ కార్యకలాపాలను ఆ దేశ పోలీసులు ఎంతమాత్రం పసిగట్టలేకపోయారు. అంతేకాక అక్కడి నుంచే దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు యత్నించాడు. అయినా అతడిపై అక్కడి పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. వీసా దొరకని నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన అతడు ఇక్కడి నుంచి వీసా పొందడంతో పాటు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే మూడు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న అతడి ‘ఉగ్ర’ కదలికలను హైదరాబాదీ పోలీసులు ఇట్టే పట్టేశారు. టర్కీ బయలుదేరుతున్న అతడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.