: ఐఎస్ఐఎస్ లో చేరడానికి వెళ్తూ పట్టుబడ్డ హైదరాబాదీ ఇంజినీర్
అమెరికాలో ఎంఎస్ చేశాడు. కానీ, తన చదువును దేశాభివృద్ధికి ఉపయోగించకుండా, కరడుగట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఉపయోగించాలనుకున్నాడు. ఐఎస్ఐఎస్ లో చేరడానికి దుబాయ్ వెళ్తూ, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ (22) అమెరికాలోని హోస్టన్ లో ఎంఎస్ చేశాడు. ఇతనికి పెళ్లి కూడా అయింది. సోషల్ మీడియా యాక్టివిటీస్ ఆధారంగా మొయినుద్దీన్ కు టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలున్నాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. విమానాశయంలో కాపుకాసి అతడని అరెస్ట్ చేశారు. తమ విచారణలో... ఐఎస్ఐఎస్ లో చేరడానికి వెళ్తున్నట్టు మొయినుద్దీన్ ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. దుబాయ్ కి చేరుకున్న తరువాత తన గర్ల్ ఫ్రెండ్ అయిన బ్రిటీష్ జాతీయురాలు నిక్కీ జోసెఫ్ తో కలసి టర్కీ మీదుగా సిరియా వెళ్లాలని మొయినుద్దీన్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిపారు. నిక్కీ జోసెఫ్ ఇటీవలే ఇస్లాం మతం పుచ్చుకుని తన పేరును ఆయేషాగా మార్చుకుంది.