: సోనియాగాంధీపై వివాదాస్పద పుస్తకం 'ది రెడ్ శారీ' విడుదల
సోనియాగాంధీపై వెలువడిన వివాదాస్పదమైన, అనధికారికమైన పుస్తకం 'ది రెడ్ శారీ' ఎట్టకేలకు భారత్ మార్కెట్లోకి విడుదలైంది. 'ఏ డ్రెమటైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ సోనియాగాంధీ'గా పేర్కొన్న ఈ పుస్తకాన్ని స్పానిష్ రైటర్ జేవియర్ మోరో రాశాడు. 2010లో ఈ పుస్తకం ఇంగ్లీష్ వర్షన్ ను ఇండియాలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ... అప్పట్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంలో సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత, కోర్టు కేసుల భయంతో ది రెడ్ శారీ పుస్తకం మార్కెట్లోకి విడుదల కాలేదని 2010లో 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనాన్ని ప్రచురించింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం ఇండియాను వదిలి వెళ్లాలని సోనియా అనుకున్నట్టు ఈ పుస్తకంలో ఉంది. అంతేకాదు, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో సోనియాగాంధీ శక్తిమంతురాలిగా ఉన్నారని పేర్కొంది. సోనియా, మేనకాగాంధీల మధ్య బంధం తదితర ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.