: జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి... నేటి మధ్యాహ్నం గ్రేటర్ మంత్రులతో కీలక భేటీ!
కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ లో ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. నిన్నటిదాకా జీహెచ్ఎంసీ ఎన్నికలపై నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వచ్చిన కేసీఆర్, తాజాగా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. నేటి మధ్యాహ్నం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ పరిధిలో ఎన్నికల నిర్వహణ, అనుకూల, ప్రతికూల అంశాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలపై నగరవాసుల అభిప్రాయం తదితరాలపై కేసీఆర్, మంత్రులను ఆరా తీయనున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో భాగంగా మొత్తం ఎనిమిది వార్డుల్లో ఆరు వార్డులను టీఆర్ఎస్ గెలుచుకోవడం, ఇటీవల టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్ పార్టీలో చేరడం తదితర కారణాల వల్ల ఎన్నికలకు పచ్చజెండా ఊపేందుకు కేసీఆర్ దాదాపు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.