: సోమవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ... ‘ఢిల్లీ జాబితా’ ఖరారు!
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 19న (సోమవారం) భేటీ కానుంది. ఢిల్లీ అసెంబ్లీ బరిలో పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులను ఆ భేటీ ఖరారు చేయనుందని తెలుస్తోంది. ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల 7న జరగనున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటిదాకా అభ్యర్థులనే ఖరారు చేయలేదు. కొత్తగా పార్టీలోకి వస్తున్న భారీ చేరికల నేపథ్యంలోనే ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా నేటి సాయంత్రం కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. నేడో, రేపో జయప్రదతో పాటు షాజియా ఇల్మీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్న అమిత్ షా, జయప్రదకు ఆ అవకాశమివ్వనున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం లోగా పార్టీలోకి చేరికలను పూర్తి చేసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం.