: ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ఎస్ బ్రహ్మ... ఏపీ కేడర్ అధికారికి కీలక బాధ్యతలు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్ఎస్ బ్రహ్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ కేడర్ (1975)కు చెందిన మరో సీనియర్ అధికారికి కేంద్రంలో కీలక బాధ్యతలు దక్కినట్లైంది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ లో కమిషనర్ గా బ్రహ్మ కొనసాగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా ఉన్న వీఎస్ సంపత్ నేడు పదవీ విమరణ చేశారు. సంపత్ స్థానంలో హెచ్ఎస్ బ్రహ్మను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోంకు చెందిన హెచ్ఎస్ బ్రహ్మ, ఏపీలో పలు కీలక హోదాల్లో పనిచేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ గా ఆయన రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అధికారుల్లో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న రెండో వ్యక్తిగా బ్రహ్మ రికార్డు సృష్టించనున్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన జేఎం లింగ్డో ఈ పదవి చేపట్టారు.