: సోమవారం బెజవాడకు చంద్రబాబు...కొత్త పోలీసు వాహనాలకు పచ్చజెండా!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 19న విజయవాడలో పర్యటించనున్నారు. రెండు రోజుల క్రితం విశాఖలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సందడి చేసిన చంద్రబాబు విజయవాడలోనూ పర్యటించాల్సి ఉంది. అయితే సింగపూర్ ప్రతినిధుల తిరుగు ప్రయాణ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అప్పటికప్పుడు ఆయన విజయవాడ పర్యటన రద్దైంది. గన్నవరం చేరుకున్న చంద్రబాబు విజయవాడలో కాలిడకుండానే తిరుపతి వెళ్లిపోయారు. తాజాగా ఈ నెల 19న విజయవాడలో చంద్రబాబు పర్యటించనున్నారని సీఎంఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా పోలీసు శాఖకు కొత్తగా అందిన వంద వాహనాలను చంద్రబాబు ఆ శాఖకు అందజేయడంతో పాటు జెండా ఊపి వాహనాలను ప్రారంభిస్తారు. అనంతరం 17 అభివృద్ధి నైపుణ్య కేంద్రాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.